Union Minister Piyush Goyal: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వాగతించారు. తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌-2026 కర్టెన్‌రైజర్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ లక్ష్యం సవాలే తప్ప అసాధ్యం కాదని అన్నారు. ఇంత భారీ లక్ష్యం సాధనకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, రైతులు, ప్రజలు, మహిళలు, అధికారులు అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వికసిత్‌ భారత్‌ 2047 దృష్టికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.తెలంగాణ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పీయూష్‌ గోయల్‌ ఆరు ముఖ్య సూచనలు చేశారు.

టాప్‌-50 ఎగుమతులకు అర్హమైన ఉత్పత్తులను గుర్తించి, కేంద్రం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఎగుమతులు చేయాలి. రైతులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు సహాయం చేసే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.

తాండూరు కందులు, నిజామాబాద్‌ పసుపు, వరంగల్‌ చపాటా మిర్చి వంటి భౌగోళిక గుర్తింపు పొందిన రాష్ట్ర ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి.

జనరిక్‌ మందుల తయారీ నుంచి బయటపడి బ్రాండెడ్‌, కొత్త ఫార్మా ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి.

అంతరిక్షం, రక్షణ, ఎలక్ట్రానిక్స్‌, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, వాటి విడిభాగాలు, మరమ్మతు, నిర్వహణ రంగాలపై పూర్తి దృష్టి సారించాలి. సైన్స్‌, టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి.

పారిశ్రామిక రంగం, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే భవిష్యత్‌ అవసరాలకు తగిన మానవ వనరులు తయారవుతాయి.

వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజల జీవితాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. నిర్దిష్ట గడువులోగా అనుమతులిచ్చే ఏకగవాక్ష విధానం ప్రవేశపెట్టాలి. దీపావళి సమయంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్లుగా, ప్రతి కొత్త పెట్టుబడి తెలంగాణతో పాటు భారత్‌ను వికసిత్‌ భారత్‌ దిశగా తీసుకెళ్తుంది.

తెలంగాణ ప్రస్తుతం ఫార్మా, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఆహార ప్రాసెసింగ్‌, నవకల్పన, పరిశోధన, సేవలు, జీసీసీలు, డిజైన్‌, ఏఐ వంటి అన్ని రంగాల్లో బలంగా ఉందని మంత్రి అన్నారు. క్వాంటం కంప్యూటింగ్‌లో కూడా తెలుగు ప్రజలు ప్రతిభ చూపుతున్నారు. ఉక్కు సంకల్పంతో కలిసి పనిచేస్తే విశ్వం కూడా సహకరిస్తుందని ఆయన షారూఖ్‌ ఖాన్‌ సినిమా డైలాగ్‌ను గుర్తు చేశారు. 2.5 టన్నుల తాండూరు కందులు హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి కావడం గొప్ప విషయమని చెప్పారు.మే 10న ప్రధాని మోదీ తెలంగాణలో పలు ప్రాజెక్టులు ప్రారంభించారని, జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అక్కడ ఆటోమొబైల్‌, ఆహార ప్రాసెసింగ్‌, యంత్రాలు, విద్యుత్‌ పరికరాలు తయారవుతాయి. వరంగల్‌లో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ దేశంలో పూర్తిస్థాయిలో ప్రారంభమైన తొలి పీఎం మిత్రా పార్కు. ఫామ్‌ టు ఫైబర్‌, ఫైబర్‌ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్‌, ఫ్యాషన్‌ టు ఫారిన్‌ లక్ష్యంతో ఇది పనిచేస్తోందని ఆయన వివరించారు.తెలంగాణ వృద్ధికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.

Next Story