ఫిరాయింపు శాసనసభ్యులకు స్పీకర్ నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్‌ఎస్ ఫిరాయింపు శాసనసభ్యులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం పది ఫిరాయింపు శాసనసభ్యుల్లో శుక్రవారం ఐదు మందికి నోటీసులు ఇవ్వగా ఈ రోజు శనివారం మరో 5 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకి స్పీకర్ గెడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల తరువాత స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఫిరాయింపు శాసనసభ్యులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఫిరాంయింపు వ్యవహారంపై నిర్ణయం స్పీకర్ చేతుల్లోనే ఉందనే ధీమాతో ఉన్న పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ శాసనసభ్యులు చాలా ధీమాగా ఉన్నారు. కానీ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపడంతో ఒక్క సారిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే బీఆర్‌ఎస్ ఫిరాయంపు శాసనసభ్యులు స్పీకర్ నోటీసులకి ఏవిధంగా స్పందిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలుపొందిన పది మంది శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పించుకుని పార్టీలు మారారు. వీరిలో భ్రదచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేరిలింగపల్లి శాసనసభ్యుడు ఆరికపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్, చేవెళ్ళ శాసనసభ్యుడు కాలె యాదయ్య, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు పార్టీ ఫిరాయించిన వారిలో ఉన్నారు. అయితే వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ శాసనసభ్యులు కేటీఆర్, కేపీ.వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్‌ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ న్యాయవాదుల వాదనలకు స్పందిస్తూ… తగినంత సమయం కావాలంటే ఎంత…? ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తయ్యేంత వరకా…? తగినంత సమయాన్ని ఎవరు ఫిక్స్ చేయాలని న్యాయస్ధానం ఫిక్స్ చేయాలా వద్దా…? చట్ట సభల గడువు ముగిసే వరకూ నిర్ణయం తీసుకోకపోతే ఎలా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ నెల 25వ తేదీవన తదుపరి విచారణ ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ పది మంది ఫిరాయింపు శాసనసభ్యులకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
