MLAs’ Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ కీలక తీర్పు
నేడు స్పీకర్ కీలక తీర్పు

MLAs’ Disqualification Petitions: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు (బుధవారం) ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. భారత రాష్ట్ర సమితి (భారాస) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు - తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు ఓపెన్ కోర్టులో ఈ తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం శాసనసభ అధికారిక వెబ్‌సైట్‌లో తీర్పు ప్రతులను అప్‌లోడ్ చేయనున్నారు.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారాస నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పలుసార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. గతంలో సుప్రీంకోర్టు జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. మిగిలిన ఎమ్మెల్యేల పిటిషన్లపై కూడా త్వరలో నిర్ణయం రావచ్చని అంచనా వేస్తున్నారు.

