Special intensive revision(SIR): ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కోటికి పైగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని అధికారిక నివేదికలు సూచిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డిజిటలైజేషన్ కాని 73.52 లక్షల ఓట్లు (మొత్తం ఓటర్లలో 21.5 శాతం) తొలగింపు జాబితాలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జిల్లాల్లోనే ఇందులో 43 లక్షల ఓట్లు ఉన్నాయి.

రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 2.64 కోట్ల మంది (78.26 శాతం) ఎన్యూమరేషన్ పత్రాలకు మాత్రమే డిజిటలైజేషన్ జరిగింది. మిగతా 74 లక్షల మంది పత్రాలు బీఎల్‌వోలకు అందించలేదు. వీటిలో 73.40 లక్షల ఓట్లను ‘అన్‌కలెక్టబుల్’ జాబితాలో ఉంచారు. స్థానిక చిరునామాలో లేకపోవడం, శాశ్వత వలస, మృతి, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) కారణాలతో ఈ ఓట్లు తొలగిపోనున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1.14 కోట్ల ఓటర్లు ఉండగా, కేవలం 71.05 లక్షల మంది మాత్రమే పత్రాలు అందించారు. మిగతా 43.09 లక్షల ఓట్లు తొలగింపు ఖాయం. అనామలీస్ (తేడాలున్న) జాబితాలో మరో 61 లక్షల ఓటర్లు ఉన్నారు. వీటిలోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. సర్‌లో 2002 వివరాలు మ్యాప్ కాని (అన్‌మ్యాపింగ్) ఓట్లకు కూడా ఆగస్టు 17 తర్వాత నోటీసులు వస్తాయి. ఓటర్లు ఎన్నికల కమిషన్ గుర్తించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది.

వలస వెళ్లిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఏఎస్‌డీడీ జాబితాలో సుమారు 40 లక్షలకు పైగా ఓటర్లు వలస వెళ్లినట్లు నమోదయ్యారు. రాష్ట్ర పరిధిలోనే రెండు లేదా మూడు చోట్ల ఓట్లు ఉన్నవారు 3.18 లక్షల మంది ఉన్నారు. వీరి ఓట్లను కూడా తొలగించనున్నారు.

డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా 94.31 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 58.89 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఇతర జిల్లాల్లో కుమురం భీం 89.43 శాతం, జనగామ 91.98 శాతం, మెదక్ 90.53 శాతం, సూర్యాపేట 90.45 శాతం వంటి ఫలితాలు నమోదయ్యాయి.

మ్యాపింగ్ సర్వేలో గతంలో 89 లక్షల ఓట్లలో తేడాలు గుర్తించగా, ఎడిట్ తర్వాత 61 లక్షల ఓట్లలో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. గ్రేటర్ పరిధిలోనే 10 లక్షలు ఉన్నాయి. ఈ ఓటర్లకు ముసాయిదా జాబితా విడుదల తర్వాత నోటీసులు అందనున్నాయి. ఈఆర్వో ముందు హాజరై అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి ఓటును కాపాడుకోవచ్చు.

మొత్తంగా సర్‌ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో కోటికి పైగా ఓట్లు తొలగిపోయే పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్లు తమ వివరాలను సకాలంలో సరిచూసుకోవాలని సూచన.

PolitEnt Media

PolitEnt Media

Next Story