Meenakshi Natarajan’s Call to Konda Surekha: మీడియాకు దూరంగా ఉండండి.. కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్
కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్

Meenakshi Natarajan’s Call to Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో సంభాషించారు. మీడియాతో మాట్లాడకుండా ఉండాలని, ఈ విషయంపై చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించినట్లు సమాచారం.
ఇటీవల మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వ దృష్టికి రావడంతో, ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొండా సురేఖ నివాసానికి మఫ్టీ వేషాల్లో పోలీసులు వెళ్లారు. సుమంత్ అక్కడ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కుమార్తె సుస్మిత పోలీసులను ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలే తమ కుటుంబంపై బురదజల్లేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని ఆమె విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్, కొండా సురేఖతో ఫోన్‌లో మాట్లాడి, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించేందుకు ప్రయత్నిద్దామని సూచించినట్లు తెలిసింది.
