CP Sajjanar Issues Strong Warning: కొత్త ఏడాది వేడుకల్లో మద్యం తాగి డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు: సీపీ సజ్జనార్ స్ట్రిక్ట్ వార్నింగ్
మద్యం తాగి డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు: సీపీ సజ్జనార్ స్ట్రిక్ట్ వార్నింగ్

CP Sajjanar Issues Strong Warning: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జనార్.. నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
మద్యం తాగి రోడ్లపైకి వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని సీపీ హెచ్చరించారు. నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు వాహనాలు జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు అమలు చేస్తామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో అల్లరి ప్రవర్తన చేస్తేనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
“రాత్రి 7 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్లకు అనుమతి. సమయం మించి వేడుకలు జరిపితే కఠినంగా డీల్ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ ఉపయోగిస్తే చర్యలు తప్పవు. బ్యాక్‌డోర్ ద్వారా మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం. క్యాబ్, ఆటో డ్రైవర్లు రైడ్స్ నిరాకరిస్తే వారిపైనా చర్యలు ఉంటాయి. పోలీసులు నూతన సంవత్సరాన్ని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రుల్లో జరుపుకోవాలి” అని సజ్జనార్ ఆదేశించారు.
ట్రాఫిక్ ఆంక్షలు.. ఫ్లైఓవర్ల మూసివేత
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ వంటి ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదు. భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈవెంట్లు జరుగుతున్న ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు జరుగనున్నాయి. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ బలగాలు డ్యూటీలో ఉంటాయి. నగరవాసులు సురక్షితంగా, బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు కోరారు.

