Food Adulteration: ఆహారం, ఔషధాలలో కల్తీని అరికట్టడానికి కఠిన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు, ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీ వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆహార, ఔషధ కల్తీ నియంత్రణపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం, పండ్లు త్వరగా పండించడం కోసం రసాయనాలు విచ్చలవిడిగా వాడుతున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల పంటల్లో రసాయన అవశేషాలు పెరిగి, విదేశీ దేశాలు భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయని సీఎం ప్రస్తావించారు.

మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో భారీ ధరలకు అమ్ముతున్న ఉత్పత్తులు నిజంగా సేంద్రియమా కాదా అని నిర్ధారించే సరైన వ్యవస్థలు లేవని సీఎం ఆరోపించారు. ఈ నేపథ్యంలో కల్తీ నిరోధనకు సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాలకు అధికారులను పంపి, అక్కడి విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

కొత్త చట్టం రూపకల్పన:

ఈ అంశంపై బిల్లు రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు. కల్తీ సమాచారం సేకరించడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.సీఎం రేవంత్‌రెడ్డి ఈ చర్యల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త చట్టం త్వరలో అమలులోకి వస్తుందని అంచనా.

PolitEnt Media

PolitEnt Media

Next Story