మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఉల్లంఘన

Supreme Court Anger: పార్టీ ఫిర్యాదులు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, ఇంతవరకు ఏమీ చేయకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని, కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనుకుంటే అక్కడే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. వచ్చే విచారణ తేదీలోపు చర్యలు తీసుకోకపోతే ధిక్కార కేసుగా పరిగణిస్తామని హెచ్చరించారు.

సోమవారం జస్టిస్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసులు విచారణకు వచ్చాయి. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన రెండు పిటిషన్లు, అసెంబ్లీ కార్యదర్శి వేసిన మూడవ పిటిషన్‌పై చర్చ జరిగింది. మూడింటిపైనా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లో సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

‘‘స్పీకర్ వైఖరి పూర్తిగా కోర్టు ధిక్కారంలా కనిపిస్తోంది. పది పిటిషన్లలో నాలుగింటిపై విచారణ పూర్తయినా నిర్ణయం లేదు. రోజువారీ విచారణలు జరపాలని మేం ఆదేశించాం’’ అని సీజేఐ గవాయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదులు పరిణామాల ఛార్ట్ చూపించాలని ప్రయత్నించగా, సీజేఐ ‘సారీ’ అంటూ తిరస్కరించారు.

కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సుందరం వాదనల్లో, ‘‘నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేశారు. మరో నాలుగింటిపై ఎవిడెన్స్ పూర్తి కాని వాదనలకు తేదీలు లేవు. రెండింటిపై కౌంటర్ అఫిడవిట్‌లు కూడా లేవు. స్పీకర్‌కు విచారణ పూర్తి చేసే ఉద్దేశం లేదు. ధిక్కార నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తదుపరి ఎన్నికలు వచ్చేస్తాయి’’ అని వాదించారు. అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ, మరో ఎనిమిది వారాలు గడువు కోరారు.

అందుకు స్పందించిన జస్టిస్ గవాయ్, ‘‘సమయం అవసరం లేదు. రోజువారీ విచారణ చేయండి. ఎమ్మెల్యేలు సహకరించకపోతే ప్రతికూలంగా పరిగణిస్తాము’’ అని చెప్పారు. సింఘ్వీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణలు జరిగాయని, మధ్యలో వరదల వల్ల పది రోజుల ఆలస్యం అయిందని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని, నోటీసులు జారీ చేశారు. సమాధానాలకు రెండు లేదా మూడు వారాలు ఎంత సమయం కావాలని కోర్టు అడిగింది.

ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపింది. స్పీకర్‌పై కోర్టు ఆగ్రహం, ఎమ్మెల్యేల అనర్హతలపై వేగవంతమైన చర్యల అవసరాన్ని హైలైట్ చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story