Telangana’s Local Reservation Rules: తెలంగాణలో స్థానిక రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. తెలంగాణ స్థానిక రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాల్సిందని స్పష్టం చేసింది.

గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈరోజు సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జెల్ల అంకిత దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.

ఈ నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం కొట్టివేసింది. ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోను సుప్రీం ధర్మాసనం మరోసారి సమర్థించింది.

ఈ తీర్పుతో తెలంగాణలో స్థానికతకు సంబంధించిన నాలుగేళ్ల నిబంధనపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.

Next Story