సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సుప్రీం కోర్టు హెచ్చరిక: 3 వారాల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోండి.. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు!


Supreme Court: పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను మూడు వారాల్లోపు తేల్చాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ గడువు పాటించకపోతే కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కింద చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

గత ఏడాది అక్టోబరు 31 నాటికి ఈ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశించినా అది అమలు కాలేదు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు నవంబరు 10న కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించింది.

స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఒక అనర్హత పిటిషన్‌పై నిర్ణయం ఇచ్చామని, మరో రెండింటిపై తుది దశలో ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగిందని, మార్చి రెండో వారంలోపు నిర్ణయాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే పిటిషనర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్పీకర్ తరఫున వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే (దానం నాగేందర్) బీఆర్ఎస్ తరఫున గెలిచిన 6 నెలల్లోనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. మరొక ఎమ్మెల్యే (కడియం శ్రీహరి) కుమార్తె కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండగా ఆయన ప్రచారం చేశారని, ఇలాంటి స్పష్టమైన కేసుల్లో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పీకర్‌కు చివరి అవకాశంగా మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ సమయంలోపు మిగిలిన పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story