Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం: ఎక్స్‌ప్రెస్‌వే వివాదం ఆర్బిట్రేషన్లోనే పరిష్కరించాలి
ఆర్బిట్రేషన్లోనే పరిష్కరించాలి

Supreme Court: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మధ్య బొంగులూరు-తుక్కుగూడ, కొల్లూరు-పటాన్చెరు మధ్య ఎనిమిది వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సంబంధిత వివాదాన్ని ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
2007లో ఈ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ల మధ్య కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. ఏదైనా వివాదం తలెత్తితే ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి.
అయితే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వేలో గాయత్రి ప్రాజెక్ట్స్‌కు ఉన్న వాటాలను గాయత్రి డొమిసైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని హెచ్ఎండీఏ తప్పుబట్టింది. తమ ముందస్తు అనుమతి లేకుండా వాటాల బదిలీ చట్టవిరుద్ధమని, ఒప్పందం చేసుకున్న సంస్థ స్వరూపం మారినందున కొత్త సంస్థకు ఆర్బిట్రేషన్ క్లాజ్ ప్రకారం వివాదం పరిష్కరించే అధికారం లేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు జూలై 15న ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించి హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. వివాద పరిష్కారం కోసం ఇరుపక్షాలు ఆర్బిట్రేటర్‌ను నియమించుకోవాలని ఆదేశించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, ప్రతివాది తరఫున రఘునందన్‌రావు వాదనలు వినిపించారు.

