పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న తెలంగాణ

Supreme Court: పోలవరం-నల్లమల సాగర్‌ లింక్‌ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సోమవారం ఈ కేసుపై విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్‌ 131 కింద సివిల్‌ సూట్‌ రూపంలో మళ్లీ దాఖలు చేయాలని కోర్టు సూచించిందని ఆయన తెలిపారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వివరణ

తెలంగాణ ప్రభుత్వం పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై అభ్యంతరాలతో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని మంత్రి గుర్తు చేశారు. గత సోమవారం కూడా విచారణ జరిగిందని, ఇవాళ అదనపు వాదనలు వినిపించామని చెప్పారు.

ప్రధాన అంశాలు:

ఏపీ ప్రభుత్వం కేటాయింపు కంటే ఎక్కువ నీటిని వినియోగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణ.

గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా ముందుకు వెళ్తోందని వాదన.

ఏపీకి కేటాయించిన 484.5 టీఎంసీల కంటే అధికంగా నీరు వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ అమలు కావడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం.

ప్రాజెక్టు ఒరిజినల్‌ డిజైన్‌కు మార్పులు చేయడానికి వీల్లేదని వాదించాం.

ఈ నేపథ్యంలో కోర్టు సూచనతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య జల వనరుల వివాదంలో కీలక మలుపుగా చెప్పవచ్చు.

Updated On 12 Jan 2026 4:11 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story