Nominated Chairman Posts: కరీంనగర్లో నామినేటెడ్ చైర్మన్ పదవులపై కోర్టు తీర్పు కోసం ఉత్కంఠ
ఉత్కంఠ

Nominated Chairman Posts: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్తగా నామినేట్ అయిన చైర్మన్లు, కమిటీ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నామినేటెడ్ ప్రక్రియను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తీర్పు ఎలా వస్తుందో, ఇటీవలే దక్కిన పదవులు కొనసాగుతాయో లేదా పోతాయో అని వారు దిగులు పడుతున్నారు.
ఈ నెల 17న తీర్పు వస్తుందని అందరూ ఎదురుచూశారు. అయితే కోర్టు కేసును 18కి, ఆ తర్వాత 19కి వాయిదా వేసింది. బుధవారం తీర్పు వెలువడుతుందని అంచనా. ప్రాథమిక సహకార సంఘాలకు కమిటీలను నామినేట్ చేయడాన్ని కోర్టు తప్పు పట్టకపోతేనే ఈ పదవులు భద్రంగా ఉంటాయి.
జిల్లాలో 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని 11 సంఘాలకు చైర్మన్లు, కమిటీ సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానకొండూరు నియోజకవర్గంలో గట్టుదుద్దనపల్లి సొసైటీకి గంగుల రాంరెడ్డి, మానకొండూరు సొసైటీకి నాగిశెట్టి రాజయ్య, దేవంపల్లి సొసైటీకి రొంటాల లక్ష్మారెడ్డి, ఊటూరు సొసైటీకి ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, పోరండ్ల సొసైటీకి గోపు మల్లారెడ్డి, నుస్తులాపూర్ సొసైటీకి మోరపల్లి రమణారెడ్డి చైర్మన్లుగా నియమితులయ్యారు. చొప్పదండి నియోజకవర్గంలో చొప్పదండి సొసైటీకి ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, రామడుగు సొసైటీకి కోల రమేశ్, తాడికల్ సొసైటీకి కీసర సంపత్, గద్దపాక సొసైటీకి బసవయ్య, మెట్‌పల్లి సొసైటీకి గాజుల మహేశ్ చైర్మన్‌గా నామినేట్ అయ్యారు. వీరంతా పదవులను స్వీకరించి విధులు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పలు సొసైటీలకు ఇలాగే చైర్మన్లు, కమిటీ సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మరో 12 సొసైటీలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా కోర్టు తీర్పు నేపథ్యంలో పెండింగ్‌లో ఉంచారు. తాడికల్, గద్దపాక, మెట్‌పల్లి, పోరండ్ల, నుస్తులాపూర్ సొసైటీ కమిటీల నియామకంపై ఇప్పటికే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు తీర్పు వెలువడేంత వరకు కొత్తగా నామినేటెడ్ కమిటీలు వేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వస్తే మిగతా సొసైటీలకు కూడా పాలకవర్గాలను వెంటనే నియమించే అవకాశం ఉంది. లేనిపక్షంలో నామినేటెడ్ చైర్మన్లు, కమిటీ సభ్యులు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తుంది. దీంతో పదవులు పొందినవారు, క్యూలో ఉన్నవారు, ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నవారు అందరూ కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మిగతా సొసైటీల్లో పదవులు దక్కించుకోవాలని చూస్తున్నవారు తమ నియోజకవర్గాల శాసనసభ్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తున్నారు. కరీంనగర్ సొసైటీ పదవికి మూల వెంకటరవీందర్‌రెడ్డి, బండ గోపాల్‌రెడ్డి, కాంరెడ్డి రాంరెడ్డి, కాశెట్టి శ్రీనివాస్, బొమ్మ ఈశ్వర్‌గౌడ్ పోటీపడుతున్నారు. దుర్శేడ్ సొసైటీకి కోరుకంటి వేణుమాధవరావు, సాయిని తిరుపతి, మాజీ ఎంపీటీసీ శేఖర్ ప్రయత్నాల్లో ఉన్నారు. గంగాధర, కురిక్యాల, కొక్కరకుంట, చిగురుమామిడి, సైదాపూర్, వెన్నంపల్లి, ఆర్నకొండ సొసైటీలకు కూడా పలువురు పోటీపడుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు సొసైటీలకు చైర్మన్లు, కమిటీ సభ్యుల పేర్లను ఖరారు చేసి నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌బాబు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు తర్వాతనే తుది నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

