NEW DISCOM : కొత్త డిస్కమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టండి
ఇంధన శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సీయం రేవంత్ రెడ్డి సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని తీసుకు రావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దీంతో ఇపుడున్న డిస్కమ్ ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని అన్నారు. డిస్కమ్ ల ఆర్ధిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిస్కమ్‌ల పునరవ్యవస్తీకరణ తో పాటు విద్యుత్ సంస్థల పై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు. 10 శాతం వరకు వడ్డీ పై తీసుకున్న రుణాల తో డిస్కమ్ లు డీలా పడ్డాయని.. ఈ రుణాలను తక్కువ వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలని అదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీయం చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీయం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇంధన శాఖ ఉన్నతాధికారలు పాల్గొన్నారు.
