Telangana ACB: తెలంగాణ ఏసీబీ: అవినీతి 'తిమింగలాలు' వలలో చిక్కిన రికార్డు సంవత్సరం!
వలలో చిక్కిన రికార్డు సంవత్సరం!

Telangana ACB: రాష్ట్ర చరిత్రలో అత్యధిక స్థాయిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులు నమోదయ్యాయి. 2025లో మొత్తం 199 కేసులతో రికార్డు సృష్టించింది. గతంలో 2023లో 95, 2024లో 152 కేసులు మాత్రమే ఉండగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన 15 మంది ఉన్నతాధికారులు ఏసీబీ వలలో చిక్కారు. వారి నుంచి రూ.96 కోట్ల విలువైన అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఓపెన్ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా. ఏసీబీ 2025 వార్షిక రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
నీటిపారుదల శాఖలో అవినీతి ఆగడాలు
నీటిపారుదల విభాగంలో కీలక పదవులు నిర్వహించిన విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఈఈ నూనె శ్రీధర్, కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరాం వంటి వారు భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఏసీబీ సోదాలు బయటపెట్టాయి. డిసెంబర్ మూడో వారంలో రవాణా శాఖ మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అతని ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.12.72 కోట్లుగా ఉండగా, మార్కెట్ విలువ రూ.100 కోట్లకు మించి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా 2025లో ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి 15 ప్రముఖ కేసుల్లో నిందితులు రూ.96 కోట్ల (రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం) ఆస్తులు పోగేసుకున్నారు. మార్కెట్‌లో ఈ విలువ వేల కోట్లలో ఉండవచ్చు.
బాధితులకు న్యాయం - రూ.35.89 లక్షలు తిరిగి
2025లో నమోదైన 199 కేసుల్లో 273 మంది నిందితులు అరెస్టు అయ్యారు. వీటిలో 157 ట్రాప్ కేసులు (లంచం తీసుకుంటూ పట్టుబడటం) ఉన్నాయి. ఈ కేసుల నుంచి రూ.57.17 లక్షలు స్వాధీనం చేసుకుని, రూ.35.89 లక్షలు బాధితులకు తిరిగి ఇచ్చారు. ట్రాప్ కేసుల్లో అరెస్టైన 224 మందిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు, మిగిలినవారు ప్రైవేటు వ్యక్తులు.
అవినీతి ఆరోపణలపై 26 సాధారణ ఎంక్వైరీలు నిర్వహించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్‌పోస్టులు, సంక్షేమ హాస్టళ్లలో 54 సడన్ చెక్కింగ్‌లు చేపట్టారు.
ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వం నుంచి 115 అనుమతులు వచ్చాయి. అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ఏసీబీ డీజీ చారుసిన్హా క్యూఆర్ కోడ్ సిస్టమ్‌ను ప్రారంభించారు, దీని ద్వారా అవినీతిపరులపై సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.

