Telangana Assembly Sessions : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ముందస్తు ఏర్పాట్లపై పోలీస్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన స్పీకర్

రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని, గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని స్పీకర్ కోరారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో సభ నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్‌ల అధ్యక్షతన జరిగిన ఈ సమావశానికి లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ సెక్రటరీ రఘనంందన్ రావు, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ రాయ రవి, ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు. శాఖలకు సంబంధించిన చర్చ జరగుతున్నప్పుడు సంబంధింత శాఖల అధికారులు సభలో అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు సహకరించాలన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయని ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విదంగా సహకరించాలని స్పీకర్ సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు.
కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనది, మంచి పేరు ఉన్నది. మీ ఆద్వర్యంలో శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగే విదంగా సహకరించాలని కోరారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామని అన్నారు.
