Telangana Chief Minister A. Revanth Reddy: హరిత శక్తి.. తెలంగాణ భవిష్యత్తు ఇంధనం
తెలంగాణ భవిష్యత్తు ఇంధనం

Telangana Chief Minister A. Revanth Reddy: రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి హరిత ఇంధనంపైనే ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి హైదరాబాద్‌ను నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో రాబోయే ఐదేళ్లలో పరిశ్రమలు ఉండవని, కాలుష్య నివారణకు కీలక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
ముంబయిలో జరిగిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, వాతావరణ మార్పులు, కరోనా వంటి సమస్యలను వాతావరణ అత్యవసర పరిస్థితిగా అభివర్ణించారు. హైదరాబాద్‌ను సురక్షితంగా, వేగంగా అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
విద్యుత్తే అసలు కరెన్సీ
ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పత్తి, వినియోగమే నిజమైన కొలమానం అని సీఎం అన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యం ఉందని వివరించారు. బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధనాల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మారడమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. కాలుష్య నియంత్రణ, పునరుపయోగం, స్థిరమైన శక్తి ఉత్పత్తిపై నిరంతర పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ప్రపంచంలో గ్లోబల్ సాఫ్ట్‌వేర్, టెక్ సంస్థలు భారతదేశాన్ని బ్యాకాఫీస్ కేంద్రంగా ఎంచుకున్నాయని, అత్యధిక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఇక్కడే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. కరోనా తర్వాత తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకమయ్యాయని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్‌లుగా విభజించామని సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) చుట్టూ 160 కి.మీ పరిధిలోని ప్రాంతం క్యూర్ జోన్‌గా ఉంటుంది. ఓఆర్‌ఆర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ప్రాంతాన్ని ప్యూర్ జోన్‌గా ప్రకటించి, తయారీ రంగానికి కేటాయించామని తెలిపారు. దీన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి, చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యమని చెప్పారు. ఈ అభివృద్ధి అంతా గ్రీన్ ఎనర్జీ ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు.
విద్యుత్ డిమాండ్ పెరుగుదల
రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం రోజుకు 16,610 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది గరిష్ఠ డిమాండ్ 17,162 మె.వా. ఉండగా, ఈ ఏడాది 19 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా. 2034 నాటికి గరిష్ఠ డిమాండ్ 34 వేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుదుత్పత్తిలో సుమారు 25 శాతం గ్రీన్ ఎనర్జీ నుంచి వస్తోంది.
తయారీ జోన్‌ల్లో పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలు, డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీనే కోరుకుంటున్నాయని, ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థలో హరిత ఇంధనమే ప్రధాన పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

