Telangana Congress MPs: భాజపా ఎంపీ తేజస్వీ సూర్య ‘తెలంగాణ విభజన భారత్-పాకిస్థాన్ విభజన కంటే దారుణంగా జరిగింది’ అని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తీవ్ర నిరసన తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు, యువత చేసిన ఉద్యమాలు, త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యానించిన తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలను సమర్థించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటులో వ్యాఖ్యానించడం కూడా సరికాదని విమర్శించారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామ్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, వేం నరేందర్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ నిలబడి నిరసన తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలో మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ నుంచి వచ్చిన ఎనిమిది మంది భాజపా ఎంపీలలో ఒక్కరు కూడా ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం విచారకరం. పైగా ఆయన తప్పు మాట్లాడలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆందోళన కలిగిస్తోంది. మేము నియోజకవర్గాల విభజన, సీట్ల పెంపును మాత్రమే వ్యతిరేకిస్తున్నా, ప్రజల దృష్టిని మరల్చేందుకు అధికారపక్షం మాపై నిందలు మోపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ నమూనాను హాస్యాస్పదంగా విమర్శించడం అవాంఛనీయం” అని అన్నారు.

తెలంగాణ ప్రజల భావాలను గౌరవించాలని, విభజన ఉద్యమ త్యాగాలను చులకన చేసే వ్యాఖ్యలు చేయకూడదని కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని, లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయ చర్చలను మరింత రగులుకొనిపించే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story