Cabinet Approves E-Cabinet System: తెలంగాణ రాష్ట్రం డిజిటల్ పాలన వైపు మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇకపై పేపర్‌లెస్ ‘ఈ-క్యాబినెట్‌’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ కేబినెట్ అమలు విధానాన్ని సమీక్షించారు.

‘ఈ-క్యాబినెట్‌’ విధానం ద్వారా మంత్రివర్గ ఎజెండాలు, నోట్స్, నిర్ణయాలు, ఫైళ్లు అన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ట్యాబెట్ లేదా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వీటిని చూసుకోవచ్చు. ఇందుకోసం మంత్రివర్గ సభ్యులందరికీ ప్రత్యేక లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు అందించనున్నారు.

ఈ వ్యవస్థతో పత్రాల భద్రత, గోప్యత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ‘ఈ-క్యాబినెట్‌’ అమలుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనుంది. దీనికోసం సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ అంచనా వేసింది. మొదటి విడతగా ఎన్‌ఐసీకి రూ.20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ డిజిటల్ మార్పు ద్వారా పాలనలో పారదర్శకత, వేగం, పర్యావరణ స్నేహపూర్వకత పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story