Telangana Government: తెలంగాణ హోంశాఖలో 7,000 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం
ప్రభుత్వం ఆమోదం

Telangana Government: తెలంగాణ రాష్ట్ర హోంశాఖలో పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 7,000 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 5,000 పోలీస్ పోస్టులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 2,000 పోస్టులు ఎస్‌పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించినవి. వీటికి కూడా త్వరలో ఉత్తర్వులు వెలువరించనుంది.
ఒకటి రెండు రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సంబంధిత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నియామక ప్రక్రియ మొదలవుతుంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగోసారి పెద్ద ఎత్తున హోంశాఖలో నియామకాలు జరగబోతున్నాయి. 2015లో మొదటిసారి 9,281 పోస్టులకు, 2018లో 1,217 ఎస్‌ఐలు, 16,285 కానిస్టేబుల్స్ పోస్టులకు, 2022లో 554 ఎస్‌ఐలు, 15,644 కానిస్టేబుల్స్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
హోంశాఖ కొలువుల భర్తీ కోసం గత కొద్ది రోజులుగా వివిధ సంఘాలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఈ ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియామకాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర భద్రత, లా అండ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేయనున్నాయి.

