పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు

Telangana Government: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల (అసిస్టెంట్ ప్రొఫెసర్లు) ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నియామకాలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ఈ నెలలో ప్రారంభమయ్యే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో మంజూరైన సహాయ ఆచార్యుల పోస్టుల సంఖ్య 2,994. వీటిలో కేవలం 763 మంది మాత్రమే రెగ్యులర్ బోధన సిబ్బంది పనిచేస్తున్నారు. మిగిలినవి ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 1,174 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 544 మంది పార్ట్‌టైమ్ అధ్యాపకులు వివిధ విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తున్నారు.

గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులను యథాతథంగా కొనసాగిస్తూనే మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలి. దీని భాగంగా సుమారు 500 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 4న విద్యాశాఖ జారీ చేసిన జీఓ 21 ద్వారా సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి మాత్రమే మార్గదర్శకాలు రూపొందించారు.

ఓస్మానియా యూనివర్సిటీలో 250, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులతో పాటు పాలమూరు, శాతవాహన వంటి ఇతర విశ్వవిద్యాలయాల్లో కొన్ని స్వల్ప సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీల పాలకమండళ్లు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఈ దస్త్రాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నాయి.

అయితే జీఓ 21లో యూజీసీ నిబంధనలకు భిన్నంగా పీహెచ్‌డీకి తక్కువ వెయిటేజీ మార్కులు ఇవ్వడంపై కాంట్రాక్టు అధ్యాపకులు, నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పీహెచ్‌డీ విద్యార్హతకు 10 మార్కుల బదులు 30 మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పార్ట్‌టైమ్ అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా గుర్తించాలని కోరుతున్నారు.

రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని తెలుస్తోంది. జీఓ 21లో అవసరమైన సవరణలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విద్యామండలికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సవరణలతో పాటు శాశ్వత పాలకమండళ్లను నియమించి, వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత ఇవ్వనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story