Telangana Government: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం సిద్ధం

Telangana Government: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సిద్ధమవుతోందని వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో ఎల్‌నినో ప్రభావంపై నిర్వహించిన సదస్సులో మంత్రులు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ సంజయ్‌జాజు, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, కమిషనర్ దివ్యాదేవరాజన్ తదితర ఉన్నతాధికారులు, జిల్లాల అదనపు కలెక్టర్లు, సీఈవోలు, డీఆర్డీవోలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీరాంజీ పథకంలో చేపట్టిన పనుల ప్రణాళికను మంత్రులు విడుదల చేశారు. కొందరు సర్పంచులు కూడా హాజరయ్యారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ భూగర్భ జలాలను అంచనా వేసి, ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించాలని, ఆటో స్టార్టర్లతో రేయింబవళ్లు మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృథా చేయకుండా చూడాలని సూచించారు. మంత్రి సీతక్క గ్రామాలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో ఒక పనితో అనేక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి శ్రీహరి కరవు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపొందించి, స్వల్పకాలిక అవసరాలతో పాటు వచ్చే ఐదు, పదేళ్లకు ఉపయుక్తమయ్యే పనులను ఎంపిక చేయాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీల వెబ్‌సైట్‌లను కూడా ప్రారంభించారు. ప్రతి గ్రామ జనాభా, అవసరాలు, వనరులు, అభివృద్ధి ప్రణాళిక, శాఖల వారీగా జరుగుతున్న పనులు వంటి సమగ్ర వివరాలు ఈ వెబ్‌సైట్‌లలో ఉంటాయని దానకిశోర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

