Deputy CM Bhatti Vikramarka: ఎల్‌నినో వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యాప్రణాళికతో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎల్‌నినోపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు.

డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రతి గ్రామంలో ఎల్‌నినోపై అవగాహన కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

పగటి సమయంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచి విద్యుత్ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఎల్‌నినో కారణంగా వర్షాకాలంలో కూడా వేసవి స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉందని, గ్రిడ్ స్థిరత్వం కోసం స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లాల వారీగా కూడా ఎల్‌నినో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రైతులు, సాధారణ ప్రజలు నీటి, విద్యుత్ భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ సదస్సు ద్వారా స్పష్టమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story