గ్రూప్-1 నియామకాలపై తీర్పు వాయిదా

Telangana High Court: గ్రూప్-1 నియామకాలకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న తీర్పు వెలువరించనున్నట్లు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు ధర్మాసనం తెలిపింది. గ్రూప్-1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)తో పాటు ఎంపికైన పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆ అప్పీళ్లపై విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం స్టేను ఎత్తివేసింది. నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని తెలిపింది.

గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందనే ఆరోపణలతో మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు చేయాలని, జవాబుపత్రాలను పునర్‌మూల్యాంకనం చేయాలని లేదా తాజా పరీక్షలు నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు గతంలోనే విచారణ పూర్తి చేసింది. నేడు తీర్పు వెలువరించాల్సి ఉండగా, తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో ఫిబ్రవరి 5కి వాయిదా పడింది.

ఈ తీర్పు వల్ల గ్రూప్-1 అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తుది నిర్ణయం ఎంపికైనవారి నియామకాలు, పరీక్షా ప్రక్రియపై ప్రభావం చూపనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story