ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈనెల పది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా వడ్డీ లేని రుణాలు


మహిళా సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభిలషించారు. ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల్ల భాగంగా శనివారం ప్రజాభవన్‌ లో మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను డిప్యూటీ సీయం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీయం భట్టి మాట్లాడుతూ దేశం అంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళలను మహారాణులుగా గౌరవించుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకొని బాగా ఎదగాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు.

రాష్ట్ర విభజన అనంతరం 10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ నేతలు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలను గాలికి వదిలేసారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ప్రారంభించి మహిళా సంఘాలను ప్రోత్సహించి వారితో ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తుందని తెలిపారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున లక్షలాదిమందితో సభ నిర్వహించి ఇప్పటికే రెండుసార్లు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. మరోసారి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాల ద్వారా లభించిన పెట్టుబడులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ ఏ వ్యాపారాలు చేయాలి అనే అంశంపై ఈనెల ఏడు నుంచి తొమ్మిది వరకు జిల్లా, మండల, గ్రామ శాఖ స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలని వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం మహిళా సంఘాలకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాం, మొదటి దశలో కోటి రూపాయల అద్దెను ఈరోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేయడం ఒక గొప్ప శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున రాబడులు మహిళా సంఘాలకు అందుతాయని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని తెలిపారు.

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో విద్యుత్ శాఖ మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని డిప్యూటీ సీఎం వివరించారు. మహిళా సంఘాల ద్వారా 1,000 మెగావాట్లకు తగ్గకుండా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి దగ్గర క్యాంటీన్లు, పాఠశాలల మరమ్మత్తులు, విద్యార్థుల స్కూల్ డ్రెస్సులు కుట్టడం వంటి పనులను మహిళా సంఘాలకు ఇచ్చి వారిని ఆర్థికంగా ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి వ్యాపారాలు చేయించాలి, మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులో భాగంగా మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించాం, ప్రతి ఏటా 20 వేల కోట్లకు తగ్గకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈనెల 10 నుంచి 16 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజలందరి సమక్షంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. కేవలం వడ్డీ లేని రుణాలే కాదు బ్యాంకు లింకేజ్, లోన్ బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Updated On 5 July 2025 2:27 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story