Dharani and Bhu Bharati Portals: ధరణి-భూభారతి పోర్టళ్లలో వందల ఎకరాల అక్రమ మ్యుటేషన్ దందా.. సీఐడీ విచారణ వేగం
సీఐడీ విచారణ వేగం

మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి
ధరణి, భూభారతి పోర్టళ్ల లోపాలను దుర్వినియోగం చేసి భూములు అక్రమంగా మార్పిడి చేసిన ముఠాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం
Dharani and Bhu Bharati Portals: ధరణి, భూభారతి పోర్టళ్లలోని సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకొని భూములను అక్రమంగా మార్పిడి చేస్తున్న ముఠాల కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు మూడు ఎకరాల భూమి అక్రమ మ్యుటేషన్‌పై సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దందాలు బహిర్గతమవుతున్నాయి. కొల్లూరు కేసులోనే సీఐడీ ఇప్పటికే రెండు దఫాలుగా తొమ్మిది మందిని అరెస్టు చేసింది.
ఇప్పుడు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, అందోలు మండలం సంగుపేట, నిజామాబాద్ జిల్లా చందూరు తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల భూములు అక్రమంగా మార్పిడి అయినట్లు సమాచారం వెలువడింది. రెవెన్యూ అధికారుల నుంచి సీఐడీకి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. సీఐడీ ఈ ముఠాల కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు చేస్తూ అక్రమ మ్యుటేషన్ల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని భూములకు సంబంధించి భూభారతి పోర్టల్‌లో కొన్ని దరఖాస్తులు ఎలాంటి నివేదికలు లేకుండానే ప్రాసెస్ అయినట్లు అధికారులు గుర్తించారు. మహ్మద్ గౌస్ పేరిట రెండు దరఖాస్తులు నమోదయ్యాయి. కూకట్పల్లి గ్రామం సర్వే నంబర్ 1070/1లోని 2 ఎకరాల 39 గుంటలు, 1070/2లోని ఒక గుంట భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండానే నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తులు వచ్చాయి.
మొదటి దరఖాస్తు డిజిటల్ సంతకం పెండింగ్‌లో ఉన్నట్లు పోర్టల్ చూపిస్తుండగా, రెండో దరఖాస్తుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 22న నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రెవెన్యూ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండా నాలా కన్వర్షన్ కోసం మరో నాలుగు దరఖాస్తులనూ గుర్తించారు. ఈ నాలుగు దరఖాస్తులు భూభారతి ఆపరేటర్ లాగిన్‌లో ‘పెండింగ్ ఫర్ క్యాప్చర్ బయోమెట్రిక్ అండ్ ఫొటో’ స్థితిలో ఉన్నట్లు తేలింది.
మొత్తం ఆరు దరఖాస్తులు కూకట్పల్లి తహసీల్దార్ నుంచి ముందస్తు అనుమతి గానీ, నివేదిక గానీ లేకుండానే ప్రాసెస్ అయినట్లు వెల్లడైంది. రికార్డులను పరిశీలించగా ఆ దరఖాస్తులేవీ తహసీల్దార్ కార్యాలయానికి అందలేదని తేలడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై కూడా సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
అందోలు మండలం సంగుపేటలో విశ్రాంత డీజీపీకి సంబంధించిన దాదాపు 4.5 ఎకరాల భూమిని ఆయనకు తెలియకుండానే ఇతరుల పేరుపైకి మ్యుటేషన్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆ విశ్రాంత డీజీపీ భార్య ఫిర్యాదు చేయగా, అలీ ముఠాతోపాటు ముఠాకు చెందిన పలువురిని సీఐడీ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ధరణి, భూభారతి ఆపరేటర్లుగా పనిచేసిన ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఎరగా చూపి ఈ ముఠా భూ అక్రమ మార్పిళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా చందూరులోనూ ఇలాంటి అక్రమ వ్యవహారంపై పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
సీఐడీ అధికారులు ఈ ముఠాలు పోర్టల్ లోపాలను ఎలా దుర్వినియోగం చేశారో, ఎవరెవరు సహకరించారో వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు మరిన్ని బయటపడే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భూముల రక్షణ కోసం పోర్టల్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాలని, అక్రమాలు జరిగిన వాటిని తిరిగి అసలు యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

