New Lok Sabha Seats: తెలంగాణకు కొత్తగా 9 లేదా 10 లోక్‌సభ స్థానాలు.. రాజకీయ భూమిక పూర్తి మార్పు!
రాజకీయ భూమిక పూర్తి మార్పు!

గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే 3 లేదా 4 సీట్లు.. తెలంగాణ నుంచి 9 మంది మహిళా ఎంపీలు తప్పనిసరి
New Lok Sabha Seats: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అమలులోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలను విభజించి కొత్తగా 9 లేదా 10 సీట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రం నుంచి లోక్‌సభ సీట్ల సంఖ్య 26 లేదా 27కి పెరగనుంది.
అదనంగా వచ్చే సీట్లలో ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 3 లేదా 4 ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నగరం కీలక కేంద్రంగా మారనుంది.
పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో 10 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 52,96,741 జనాభాతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశవ్యాప్తంగా 17వ ర్యాంకులో ఉంది. ఈ జిల్లా ప్రస్తుతం చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. పునర్విభజన అమలు తర్వాత ఈ సీట్ల పరిధులు పూర్తిగా మారిపోయి కొత్త లోక్‌సభ స్థానాలు ఏర్పడనున్నాయి. ఏ ప్రాంతం ఏ సీటు పరిధిలోకి వస్తుందనేది పునర్విభజన తర్వాతే స్పష్టమవుతుంది.
ప్రస్తుత మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో జనాభా అధికంగా ఉండటంతో వీటిని విభజించి కొత్తగా 3 లేదా 4 సీట్లు ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం 2024 ఎన్నికల సమయంలో 37.79 లక్షల ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద సీటుగా నిలిచింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు వేరు వేరుగా విభజన చేస్తే కొత్తగా రెండు సీట్లు ఏర్పడే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం మెదక్, జహీరాబాద్ సీట్లు ఉన్నందున కొత్తగా మరో ఒక సీటు ఏర్పడనుంది. అలాగే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలను విభజించి అదనపు ఒక సీటు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలను విభజించి ఒకటి లేదా రెండు సీట్లు ఏర్పాటు చేసే సూచనలు ఉన్నాయి.
మహిళలకు తొమ్మిది సీట్లు తప్పనిసరి
ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్‌సభలో డీకే అరుణ, కడియం కావ్య అనే ఇద్దరు మహిళా ఎంపీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ తరఫున ఏకంగా 9 మంది మహిళలు లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మహిళల రిజర్వేషన్ చట్టం ప్రకారం 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి 2026-27 జనాభా ఆధారంగా ఈ రిజర్వేషన్ అమలు కానుంది. దీంతో తెలంగాణ నుంచి 9 మంది మహిళా ఎంపీలు ఎన్నికవడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

