Telangana Ministers Urge Centre: రాష్ట్ర అంచనాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు పెంచాలి: కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి
కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి

Telangana Ministers Urge Centre: తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో, కేంద్రం కూడా రాష్ట్ర అంచనాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ లక్ష్యాలను పెంచాలని కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తెలంగాణ మంత్రులు విన్నవించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం దిల్లీలో ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 80.09 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని, కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. 2025-26 మార్కెటింగ్ సీజన్‌లో ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి 152 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరించినట్లు వివరించారు. అయితే రాష్ట్రం సమర్పించిన ఉత్పత్తి అంచనాలకు విరుద్ధంగా కేంద్రం వరి సేకరణ లక్ష్యాలను తక్కువగా నిర్ధారించడం వల్ల గత మూడు సీజన్లలో రాష్ట్ర ఖజానాపై రూ.16,446 కోట్ల అదనపు ఎంఎస్‌పీ భారం పడిందని ఆయన తెలిపారు.
2025-26 రబీ సీజన్‌కు రాష్ట్రం 90 లక్షల టన్నుల వరి సేకరణ అంచనా సమర్పించినా, కేంద్రం కేవలం 35 లక్షల టన్నులు మాత్రమే నిర్ధారించిందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని కోరారు. భవిష్యత్తులో కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు రాష్ట్ర అంచనాలకు సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు.
సీఎంఆర్ సరఫరా గడువు పొడిగింపు:
2024-25 రబీకి సంబంధించి ఇంకా 5 లక్షల టన్నుల బియ్యం, ఖరీఫ్ 2025-26కు 14.24 లక్షల టన్నుల బియ్యం కేంద్ర పూల్‌కు సరఫరా చేయాల్సి ఉందని మంత్రులు తెలిపారు. గిడ్డంగులు, నిల్వ స్థలాల కొరత, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడి వంటి కారణాలను దృష్టిలో ఉంచి రబీ 2024-25 సీఎంఆర్ సరఫరా గడువును మరో 60 రోజులు, ఖరీఫ్ 2025-26 గడువును 120 రోజులు పొడిగించాలని కోరారు.
కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు:
అదే సందర్భంలో మంత్రులు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి, భద్రాద్రి రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని వినతిపత్రం అందించారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదన అందగానే సర్వే చేయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపాదిత స్థలం సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ స్థలం చూపించి, అక్కడ సర్వే చేసి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశాలు తెలంగాణ రైతుల హక్కులు, అభివృద్ధి అవసరాలను కేంద్రం దృష్టిలో ఉంచాలనే సందేశాన్ని ఇచ్చాయి.

