Telangana Ministers: జూరాలకు నీరు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల వినతి
మంత్రుల వినతి

పంటల రక్షణకు ఐదు టీఎంసీలు కావాలి.. బెంగళూరులో భేటీ
Telangana Ministers: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జూరాల జలాశయం కింద నీటి అవసరాలు, రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జలాలను విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, మేఘారెడ్డి సహా తెలంగాణ బృందం బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎంకు వినతిపత్రం అందజేసింది. ఈ బృందం అంతకుముందు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి జూరాల ఆయకట్టు సమస్యలను వివరించింది. సీఎం రేవంత్‌రెడ్డి కర్ణాటక సీఎంకు ఫోన్ చేసి జూరాల దిగువ అవసరాలను వివరించారు. నీటి నిల్వలు తగ్గిపోయిన నేపథ్యంలో ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీటి విడుదల అవకాశాలపై చర్చించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా డీకేతో మాట్లాడారు.
పాలమూరు రైతులను ఆదుకోండి
జూరాల జలాశయం కింద సాగవుతున్న పంటల పరిస్థితిని, నీటి అవసరాలను తెలంగాణ బృందం కర్ణాటక సీఎం డీకేకు వివరించింది. ఐదు టీఎంసీల నీరు అవసరమని మంత్రులు తెలిపారు. జూరాలపై ఆధారపడిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు ఉన్నాయని వివరించారు. ఇవి కీలక దశలో ఉన్నందున వాటిని కాపాడేందుకు కర్ణాటక నుంచి కృష్ణా జలాలు విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వర్షాలు లేక ఎగువ నుంచి జూరాలకు రావాల్సిన ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. నీటి కొరత ఏర్పడితే రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
తాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని నారాయణపూర్, ఆలమట్టి జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. రోజుకు ఐదు వేల క్యూసెక్స్ చొప్పున ఒక నెలపాటు నీటిని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో కృష్ణా పరీవాహకంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం దశలవారీగా నీటిని విడుదల చేస్తే ఉన్న వనరులతో పంటలను కాపాడుకోవచ్చని మంత్రులు తెలిపారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితుల్లో నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కర్ణాటక సీఎల్పీ సమావేశం కారణంగా బిజీగా ఉన్న డీకే శివకుమార్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అవుదామని తెలంగాణ బృందానికి సూచించారు. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి, కార్యదర్శి, ఇతర అధికారులతో కలిసి తెలంగాణ నీటి అవసరాలపై చర్చిద్దామని పేర్కొన్నారు. రాష్ట్ర అభ్యర్థనపై డీకే పూర్తి సానుకూలంగా స్పందించారని, తాగు, సాగునీటి పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలంగాణ బృందం తెలిపింది.
సాగుకు మరణశాసనం రాసింది కేసీఆరే: శ్రీహరి, జూపల్లి
‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు సరిపోతాయంటూ నాడు సంతకం చేసి తెలంగాణ వ్యవసాయానికి మరణశాసనం రాసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే’ అని మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. భారాస నాయకులు అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
బెంగళూరుకు బయలుదేరే ముందు అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాలులో విలేకరులతో మాట్లాడుతూ వారు ఇలా అన్నారు: ‘‘జూరాలకు నీటి కోసం 20వ తేదీనే కర్ణాటక సీఎంకు లేఖ రాశాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. నీళ్లు వస్తే ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారాస నాయకులు హడావుడి చేస్తున్నారు. ఎల్‌నినో కారణంగా కరవు పరిస్థితులున్నాయని రైతులకు ముందే చెప్పాం. భారాస నేతలే రైతులను రెచ్చగొడుతున్నారు. 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న జూరాల కోసం భారాస పాలనలో అదనంగా ఎందుకు రిజర్వాయర్లు కట్టలేదు? 7 టీఎంసీలతో 6 లక్షల ఎకరాలు సాగు కావని కేసీఆర్‌కు తెలియదా? గట్టు, భూత్పూర్, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను నిర్మిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.’’

