Deputy CM Bhatti Vikramarka: రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదాయం సమకూర్చే ఇంటిపెద్ద ఆకస్మికంగా మరణించినా కుటుంబాలు ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబానికి నవంబరు 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రూ.70 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలసి ఉపముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. మన్ననూరులో 220/30 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించినా గత పదేళ్లలో నిధుల దోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు. ధరణి పేరిట భూములను కొల్లగొట్టి ప్రజల స్వేచ్ఛను హరించే సమయంలో తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్రలు, భారీ బహిరంగ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చామని గుర్తు చేశారు. పీపుల్స్‌మార్చ్‌లో భాగంగా లింగాల, బల్మూర్‌, అచ్చంపేట మండలాల్లోని 42 గ్రామాల్లో 130 కిలోమీటర్ల పాదయాత్ర చేశామని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు డిమాండు 20 వేల మెగావాట్లకు పెరిగినా ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని వివరించారు. 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయం ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీలు కృష్ణ భాస్కర్‌, జితేష్‌ పాటిల్‌, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌, సబ్‌ కలెక్టర్‌ సలోని తదితరులు పాల్గొన్నారు.

Next Story