తెలంగాణను దోచుకున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

రూ.లక్ష కోట్లు మింగిన కేసీఆర్, కేటీఆర్‌లను రక్షిస్తున్నదెవరు?

కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు దత్తపుత్రుడిలా మారారు

భారాస, భాజపా ఒకటే.. వారికి ఓటు వేస్తే మూసీలో కలిపినట్టే

70 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. లెక్క చూసుకోండి

ఇందులో ఒక్కటి తక్కువైనా నా తల తీసుకోండి: సీఎం సవాల్


CM Revanth Reddy Slams: గోదావరి నీటిని కవర్‌గా చేసుకుని అప్పటి భారాస నాయకులు తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేసిన కేసీఆర్, కేటీఆర్‌లను ఎవరు రక్షిస్తున్నారని భాజపా నేతలను నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌ శివారులో శుక్రవారం జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతిబాట’ బహిరంగ సభకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సహా సీఎం హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారాస పాలనలో కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చారని ప్రధాని మోదీ, అమిత్‌షా ఆరోపణలు చేశారు. అధికారంలోకి వస్తే 48 గంటల్లో కేసీఆర్, హరీశ్‌లను జైల్లో వేస్తామని చెప్పారు. మేము అసెంబ్లీలో చర్చించి ఆరు నెలల క్రితమే కాళేశ్వరం విషయాన్ని సీబీఐకు అప్పగించాం. 48 గంటల్లో బాధ్యులను అరెస్ట్‌ చేస్తానన్న కిషన్‌రెడ్డి ఎక్కడికి పారిపోయారు? ఫార్ములా-ఈ కేసును కేంద్రానికి పంపితే మోదీ ఆఫీసులో మూలపడేశారు. భారాస నేతలను ఎవరు కాపాడుతున్నారో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు తెలియదా?

తెలంగాణ నుంచి 8 మంది భాజపా ఎంపీలు గెలిచినా మోదీ నిధులు ఇవ్వలేదా? కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కేంద్ర మంత్రులుగా నియమించారు కానీ.. హైదరాబాద్‌ మెట్రో ఎక్స్‌టెన్షన్‌, మూసీ క్లీనింగ్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఒక్క రూపాయి కూడా రాలేదు. భారాస, భాజపాల మధ్య విడదీయలేని సంబంధం ఉంది. వీరు ఎవరు గెలిచినా ఒకటే. వారికి ఓట్లు వేయడం మూసీలో కలిపినట్టు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును ఒకటే అడుగుతున్నా. మీ పక్కనున్న కిషన్‌రెడ్డి ఎవరు? ఆయన కల్వకుంట్ల కిషన్‌రావుగా మారిపోయారు. కేసీఆర్‌కు దత్తపుత్రుడిలా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్‌కు సేవ చేయడం మాని.. కిషన్‌రెడ్డి ప్రజల జీవితాల్లో కలవాలి.

మనవాడు కార్పొరేటర్‌గా గెలవాలి

యువతను ఒకటే కోరుతున్నా. భారాస-భాజపాలకు ఓట్లు వేసి కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధి చేయమని ఎలా? నేను నిధులు కేటాయించాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనవారు ఉండాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలంటే మనవారు అవసరం. మన బస్తీలు, కాలనీల్లో సౌకర్యాలు మెరుగుపరచాలంటే మనవాడు కార్పొరేటర్‌గా గెలవాలి.

నిజామాబాద్‌ జిల్లా బర్దీపూర్‌ శివారులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, రాకేశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

అవును.. నేనే రేవంతుద్దీన్‌

భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుకు చెబుతున్నా. బలహీన వర్గాల కుల గణన చేయించినందుకు సంతోషంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ నన్ను రేవంత్‌గౌడ్‌ అన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఆ కులాలకు న్యాయం జరిగినప్పుడు మా మంత్రి రాజనర్సింహ నన్ను రేవంత్‌ మాదిగ అన్నారు. మొదటిసారి మంత్రి వాకిటి శ్రీహరిని క్యాబినెట్‌లోకి తీసుకున్నప్పుడు రేవంత్‌ ముదిరాజ్‌ అన్నారు. హైదరాబాద్‌లో సదర్‌ ఉత్సవాలు నిర్వహించినందుకు నన్ను రేవంత్‌ యాదవ్‌ అని అభినందించారు. మూసీ నది పరిసరాల్లో స్వర్ణ దేవాలయం నిర్మాణం చేపట్టినప్పుడు సిక్కు సమాజం సర్దార్‌ రేవంత్‌సింగ్‌ అని పిలిచారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story