MLC Kavita : తెలంగాణ నీళ్ళను చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చారు
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ లపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కలసి మన తెలంగాణ నీళ్ళను తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇచ్చి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు భేటీ అయి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ఇచ్చిందని, కానీ సీయం రేవంత్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చి అసలు బనక చర్ల ప్రస్తావనే రాలేదని చెప్పారని ఇంతకన్నా సిగ్గులేని తనం ఉంటుందా అని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణను పరిపాలించే హక్కు రేవంత్ రెడ్డికి లేదని కవిత అభిప్రాయపడ్డారు. వెంటనే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
వాస్తవానికి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రా ప్రజలకు కూడా ఎటువంటి ఉపయోగం లేదని, ఈ ప్రాజెక్టు కేవలం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకే ఈ ప్రాజెకటు తలపెట్టారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీయం రేవంత్ రెడ్డి సైతం మెగా కంపెనీకి మద్దతుగానే ఢిల్లీ వెళ్లారని కవిత ఆరోపించారు. నిన్న జరిగింది అనధికార సమావేశం అని ముఖ్యమంత్రి చెపుతున్నారని… అది అనఫిషియల్ మీటింగ్ అయితే ఆ సమావేశంలో కేంద్ర మంత్రి ఎందుకు పాల్గొన్నారని కవిత ప్రశ్నించారు. అఖిల పక్ష సమన్వయంతో ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని కవిత ప్రకటించారు. పార్లమెంటులో కూడా తెలంగాణ ఎంపీలందరూ బనకచర్ల ప్రాజెక్టు గురించి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు
