NEET Protest Bandh: తెలంగాణ వ్యాప్తంగా నీట్ నిరసన బంద్ విజయవంతం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఎన్‌టీఏ రద్దు డిమాండ్
ఎన్‌టీఏ రద్దు డిమాండ్

NEET Protest Bandh: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ, విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బంద్ పూర్తి స్థాయిలో, శాంతియుతంగా జరిగింది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
‘‘నీట్ నిర్వహణలో విఫలమై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలి. విశ్వసనీయతను కోల్పోయిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలి. ప్రవేశ పరీక్షల వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన హింసకు కేంద్రం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లాఠీఛార్జీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అనే నినాదాలతో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
హైదరాబాద్‌లో భారీ ప్రదర్శనలు
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద గాడిదతో నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నేతృత్వంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐడీఎస్‌వో, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు నారాయణగూడ నుంచి జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి వైఎంసీఏ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, టి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
‘రాత్రి మేల్కొని దేశాన్ని మేల్కొలుపుదాం’ నినాదంతో పీపుల్ ప్లాజా వద్ద నిరసన జరిగింది. హెచ్‌సీయూలో ఎన్‌ఎస్‌యూఐ, ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆచార్యులు డి.నరసింహారెడ్డి, భాంగ్యా భూక్యా పాల్గొన్నారు. జేఎన్‌టీయూ, సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయాల్లో తరగతులు బహిష్కరించారు.
శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించి, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం కోరారు. వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
మంత్రి పొన్నం మద్దతు
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలోని విద్యార్థుల శాంతియుత నిరసనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. జంతర్‌మంతర్ వద్దకు వెళ్లవద్దంటూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జారీ చేసిన నోట్‌ను ఆయన ఖండించారు.

