Sridhar Babu: తెలంగాణ-తమిళనాడు సహకారమే దక్షిణ భారత అభివృద్ధికి మార్గం: శ్రీధర్‌బాబు
శ్రీధర్‌బాబు

Sridhar Babu: తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో పరస్పరం పోటీపడే రాష్ట్రాలు కావని, రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దక్షిణ భారతదేశం మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తమిళనాడు పారిశ్రామికవేత్తలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో గురువారం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ రోడ్‌షోలో మంత్రి ఉపన్యసించారు. తాము తమిళనాడుతో పోటీ పడేందుకు చెన్నైకి రాలేదని, తమ ప్రయాణంలో ఇక్కడి పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
పారిశ్రామిక రంగంలో తమిళనాడు సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని శ్రీధర్‌బాబు అన్నారు. ఇంజనీరింగ్ విద్య, ఆటోమొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, విద్యుత్ వాహనాల తయారీలో తమిళనాడు దేశానికి ఆదర్శమని కొనియాడారు. తమిళనాడుకు తనదైన బలాలు ఉన్నాయని, తెలంగాణకు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కోయంబత్తూరు, తిరుప్పూర్ పర్యటనల సందర్భంగా అక్కడి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరును దగ్గరగా పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. కోయంబత్తూరులోని పంపుల తయారీ సంస్థలు ఉత్తర, మధ్య భారత మార్కెట్లకు చేరువయ్యేందుకు తెలంగాణలో రెండో యూనిట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. తిరుప్పూర్ నిట్వేర్ పరిశ్రమలు వరంగల్‌లోని పత్తి ఆధారిత వస్త్ర పరిశ్రమలతో కలిసి పనిచేయవచ్చని సూచించారు. చెన్నై ఆటోమొబైల్ విడి భాగాల తయారీ సంస్థలు హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ నిపుణుల సహకారంతో విద్యుత్ వాహనాల ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ‘రైజింగ్ 2047’ విజన్‌తో భారత్ ఫ్యూచర్ సిటీగా తెలంగాణ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తమిళనాడు పారిశ్రామికవేత్తలు హాజరుకావాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు నిర్ణీత సమయంలో అనుమతులు ఇచ్చేందుకు టీజీ-ఐపాస్ విధానం అందుబాటులో ఉందని వివరించారు.
ఈ సందర్భంగా తైవాన్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, రష్యా, థాయ్‌లాండ్, మలేషియా దేశాలకు చెందిన దౌత్య, వాణిజ్య ప్రతినిధులతోనూ శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు.

