ఎస్సై, కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు!

Deccan Cement Factory: సూర్యాపేట జిల్లా పాలకవీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారాంతపు సెలవు రోజున వినోద్ (45) అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు అతడిని ఫ్యాక్టరీలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మిర్యాలగూడ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ బిహార్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో కార్మికులు పోలీసులపై దాడికి దిగారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై కర్రలతో దాడి చేసి, వారిని గాయపరిచారు. బిహార్ కార్మికుల దాడిలో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు గాయపడ్డారు. పోలీసు వాహనంపై రాళ్లు విసిరారు. ఫ్యాక్టరీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సుమారు 200 మంది బిహార్ కార్మికులు ఆందోళనలో పాల్గొనడంతో పోలీసులు కొంత అసహాయ స్థితిలో పడ్డారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు పట్టుబట్టారు. స్పష్టమైన హామీ లభించే వరకు ఆందోళనను విరమించబోమని తేల్చిచెప్పారు.

ఈ పరిస్థితిని ఎస్సై తన ఉన్నతాధికారులకు తెలియజేయడంతో, పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కార్మికులను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. కార్మికులు ఒకరిద్దరు వస్తే పరిహారం గురించి చర్చిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story