TGPSC Chairman Burra Venkatesham: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక పరీక్షల షెడ్యూలు ఖరారైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఒకే రోజున రెండు వేర్వేరు నియామక సంస్థల పోటీ పరీక్షలు ఉంటే ఆయా పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రత్యామ్నాయ తేదీల్లో రాయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే ఏఈఈ పరీక్షలకు ఈ వెసులుబాటు ఇచ్చామన్నారు.

గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీఆర్‌టీ) విధానంలోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు. రాతపరీక్ష ముగిసిన మూడు వారాల్లో తుది ఫలితాలు వెల్లడిస్తామని, ఉద్యోగ ప్రకటన జారీ నుంచి ఫలితాల వెల్లడి వరకు సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన మూడు నెలల్లోగా కమిషన్ పరిపాలన ప్రక్రియ పూర్తిచేసి ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తామన్నారు. సహాయ స్టాటిస్టికల్ అధికారుల (102) పోస్టులకు ఇప్పటికే ప్రకటన జారీ చేశామని, త్వరలోనే 1,395 అటవీ బీట్ అధికారుల ఉద్యోగ ప్రకటన జారీ చేస్తామని తెలిపారు.తప్పుల్లేని ప్రాథమిక కీ విడుదల చేస్తున్నామని, అభ్యర్థులు ఆ కీలోని తప్పులను ‘ఛాలెంజ్ క్వశ్చన్’ కింద రూ.500 చెల్లించి సవాల్ చేయాలన్నారు. ప్రశ్న జవాబు తప్పు అయితే ఆ ఫీజు మొత్తాన్ని వెనక్కు ఇస్తామని వివరించారు. పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ప్రకారం సరైన జవాబులు, మార్కుల అంచనా ఇచ్చే వ్యవస్థ పరిశీలనలో ఉందని, ఆరు నెలల్లోగా అమల్లోకి తెస్తామన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల పీఎస్సీలను అధ్యయనం చేసి ప్రశ్నపత్రం తయారీ నుంచి ఫలితాల వెల్లడి వరకు సంస్కరణలు అమలు చేస్తున్నామని ఛైర్మన్ చెప్పారు. నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత దరఖాస్తుకు నెల రోజుల గడువు, సన్నద్ధతకు మరో రెండు నెలలు అవకాశం కల్పిస్తామన్నారు. పరీక్షల తేదీలు ప్రకటించిన తర్వాత 25 రోజుల్లో పూర్తి చేస్తామని, దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒక అంచె పరీక్షలో నియామకాలు మూడు నెలల్లో, రెండంచెల్లో ఆరు నెలల్లో, మూడంచెల్లో తొమ్మిది నెలల్లో పూర్తవుతాయన్నారు. ప్రస్తుతం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఉన్నందున మూడంచెల పద్ధతి వర్తిస్తుందని, వేర్వేరు విద్యార్హతలున్న పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పారు. దీనివల్ల న్యాయ వివాదాల వల్ల ఆలస్యం తగ్గుతుందన్నారు.

వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో 33 లక్షల మంది అభ్యర్థులున్నా పోటీ పరీక్షలకు 5-6 లక్షల మంది మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు. అభ్యర్థులు సర్టిఫికెట్లు, అర్హతల పత్రాలన్నీ అప్‌లోడ్ చేయాలని సూచించామని, ఇప్పటివరకు 2 లక్షల మంది సవరించి పత్రాలు అప్‌లోడ్ చేశారన్నారు. ఒకసారి వివరాలు నమోదు చేసిన తర్వాత అదనపు విద్యార్హతలు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ మినహా మిగతా వివరాలు నవీకరించేందుకు వీల్లేదన్నారు. అప్‌లోడ్ చేసిన పత్రాలను మూడంచెల్లో ముందస్తుగా ధ్రువీకరిస్తామని, వ్యక్తిగత వివరాలను ఆధార్ సహాయంతో, విద్యార్హతలను ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీల డేటాబేస్‌తో, కుల-ఆదాయ-నివాస ధ్రువీకరణ పత్రాలను మీసేవతో పరిశీలిస్తున్నామని వివరించారు. దీనివల్ల దరఖాస్తుతో పాటు పత్రాల పరిశీలన పూర్తవుతుందని, ఫలితాల తర్వాత ఒరిజినల్ పత్రాలు చూడటం వల్ల ధ్రువీకరణ వేగంగా పూర్తవుతుందన్నారు.

1,395 అటవీ బీట్ అధికారుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని, డిగ్రీ లెక్చరర్ల (550) పోస్టులకు మరిన్ని వివరాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. వ్యవసాయ, వెటర్నరీ అధికారుల పోస్టుల ప్రతిపాదనల్ని మార్పుల కోసం సంబంధిత విభాగాలు వెనక్కు తీసుకున్నాయని తెలిపారు. కొన్ని విభాగాల్లో 200 వరకు పోస్టులు ఉన్నాయని, వాటిని కలిపి ఇవ్వాలా లేదా వేర్వేరుగా చేయాలా అని ఆలోచిస్తున్నామన్నారు. సిలబస్ 10-20 శాతం మారినప్పుడు నోటిఫికేషన్‌లో పేర్కొంటామని, 25 శాతానికి మించి మార్పులు ఉంటే ముందుగానే అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. సిలబస్ కమిటీని నియమించి ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని, కొత్త సిలబస్ ప్రకటించిన తర్వాత ఆరు నెలల అనంతరం వచ్చే నోటిఫికేషన్లకే అది వర్తిస్తుందన్నారు.

గ్రూప్-1, 2, 3, 4తో పాటు ఇతర పోటీ పరీక్షలన్నీ సీబీఆర్‌టీ పద్ధతిలోనే జరుగుతాయని, ఇక నుంచి ప్రశ్నపత్రాల కాగిత ముద్రణ ఉండదని ఛైర్మన్ చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రశ్నలు ప్రశ్నల నిధిలో చేరతాయని, తేలిక, మధ్యస్థం, కఠినం, అత్యధిక కఠినం కేటగిరీల వారీగా ప్రత్యేక అల్గారిథంతో రెండు గంటల ముందు ప్రశ్నపత్రం సిద్ధమవుతుందన్నారు. ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలు ఉంటాయన్నది సాఫ్ట్‌వేర్‌కు మినహా ఎవరికీ తెలియదని, రెండు గంటల ముందు సిద్ధమైన మూడు సెట్లలో ఒకదాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రధాన సర్వర్‌కు, అరగంట ముందు సెంట్రల్ సర్వర్‌కు వెళ్తుందని, అభ్యర్థి లాగిన్ అయ్యేవరకు ప్రశ్నలు ఎవరికీ తెలియవన్నారు. పరీక్షల్లో అభ్యర్థి లైవ్ ఫొటోను హాల్‌టికెట్ ఫొటోతో సరిపోల్చుతామని, పరీక్ష కేంద్రంలో సాఫ్ట్‌వేర్ సంస్థ, ప్రభుత్వ విభాగాల నుంచి 50 శాతం మంది చొప్పున ఇన్విజిలేటర్లు ఉంటారని, వారిని థర్డ్ పార్టీ తనిఖీ చేస్తుందన్నారు.

పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉద్యోగాలు పొందలేకపోయిన టాప్-10 మెరిట్ అభ్యర్థులకు ప్రభుత్వ రంగ, కార్పొరేట్ సంస్థలు తమ అవసరాల మేరకు ఎంపిక చేసుకునేందుకు ‘ప్రతిభా వారధి’ ద్వారా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఓటీఆర్ నమోదు చేసిన అభ్యర్థుల్లో 35 వేల మంది ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్నారని, గతంలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు.

Next Story