Assembly Gunpark : శాసనసభ 15రోజులకి పైగా నడపాలి
యూరియా కొరతపై కేటీఆర్ నేతృత్వంలో గన్‌పార్క్ వద్ద వినూత్న నిరసన

పది సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏనాడు రాష్ట్రంలో ఎరువుల కొరత రాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ శాసనసభ్యులతో పాటు ఆయన గన్‌పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలియజేశారు. గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా, రేవంత్ దోషం రైతన్నకు మోసం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతన్నలకు ఎరువులు సరఫారా చేయలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శాసనసభను తనకు అనుకూలంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని, రైతుల సమస్యలు, ఎరువుల కొరతపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని కేటీఆర్ విమర్శించారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడాల్సిన పరిస్ధితులు ఏనాడు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టే పరిస్ధితి రైతులకు దాపురించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అంతకన్నా ఎక్కువ రోజులు నిర్వహించినా మేము సిద్దమే అని కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశంపై సభలో చర్చకు పెట్టినా బీఆర్‌ఎస్ సిద్దంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతామని అన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.
