రైతుల క్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం - డిప్యూటీ సీఎం భట్టి
The welfare of farmers is the goal of the public government - Deputy CM Bhatti

రైతుల క్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం - డిప్యూటీ సీఎం భట్టి
రైతన్నల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రైతులకు భరోసా కల్పించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం అనీ.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అనీ చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21,763 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసినట్టు తెలిపారు. సీజన్‌లో పెట్టుబడి సాయంగా తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లు విడుదల చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వ నిబద్ధతను చాటిందన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.17,091 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, 42.16 లక్షల మంది రైతులకు బీమా కవరేజీ కల్పించామని వివరించారు. సన్న ధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ రూపంలో ఇప్పటి వరకు రూ.1,199 కోట్లు విడుదల చేశామని తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.50 కోట్లు జమ చేసినట్టు పేర్కొన్నారు. ఇందిరా గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నామని, ఇందుకోసం రూ.12,600 కోట్లు కేటాయించామని చెప్పారు. నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్** ఏర్పాటుకు రూ.11,600 కోట్లు కేటాయించామని, తొలి దశలో **58 పాఠశాలలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. గురుకులాలు, వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచినట్లు చెప్పారు.
మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 188 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారని ఈ ప్రయాణాలపై ప్రభుత్వం ఆర్టీసీకి రూ.4,310 కోట్లు చెల్లించిందని తెలిపారు. మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రూ.580 కోట్లు సబ్సిడీ చెల్లించామని తెలిపారు.
