అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరితో చర్చించి చర్యలు తీసుకుంటామన్న సీయం రేవంత్

జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఇచ్చిన నివేదిక వెనకాల ఎటువంటి రాజకీయ జోక్యం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు. క్యాబినేట్‌ సమావేశం అనంతరం జస్టిస్‌ పీసీఘోష్‌ నివేదికపై సీయం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీఘోష్‌ కమిషన్‌ నివేదికను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని సీయం తెలిపారు. పీసీఘోష్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందిరతో చర్చించిన మీదటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పీసీఘోష్‌ కమిషన్‌ ఒక స్వతంత్ర కమిషన్‌ అని, నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయి తప్పితే ఎటువంటి కక్షపూరిత చర్యలకు తమ ప్రభుత్వం దిగదని సీయం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీ ప్రకారమే జస్టిస్‌ పీసీఘోష్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు సీయం వివరించారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలకే కూలిపోయిందని సీయం విమర్శించారు. ఈవిషయాన్ని కమిషన్‌ స్పష్టంగా తన నివేదికలో పేర్కొందన్నారు. రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, నిపుణులు, ప్రజా సంఘాలు, ప్రజలు, పాత్రికేయుల నుంచి కమిషన్‌ సమాచారం సేకరించి వారి వాదనలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించిందని సీయం వెల్లడించారు. నివేదికలు తమకు అనుకూలంగా ఉంటే ఒకలా వ్యతిరేకంగా ఉంటే మరోలా మాట్లాడటం బీఆర్‌ఎస్‌ నేతలకు అలవాటే అని సీయం ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు కుమ్మక్యయ్యారో ఎంత అవినీతి జరిగిందో ఎమ్మెల్సీ కవిత జస్టిస్‌ పీసీఘోష్‌ కమిషన్‌కు నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదని, అప్పుడు కమిషన్‌ ముందు మాట్లాడకుండా ఇప్పుడు ప్రశ్నించడం ఎందుకని సీయం రేవంత్‌రెడ్డి నిలదీశారు

Politent News Web 1

Politent News Web 1

Next Story