సిట్ విచారణపై ప్రభాకర్ రావు సుప్రీమ్ కోర్టు లో పిటిషన్

తనను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ పోలీసు అధికారి, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు ప్రభాకర్‌ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. తరచూ విచారణకు పిలుస్తూ గంటల తరబడి కార్యాలయంలో ఉంచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అవసరం లేకపోయినప్పటికీ పిలిపించి వేధిస్తున్నారని సుప్రీంకోర్టులో ప్రభాకర్‌ రావు పిటిషన్ వేసినట్లు సమాచారం. తాను పూర్తిగా సహకరిస్తున్నా కూడా సిట్‌ అధికారులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని, విచారణల పేరుతో తరచూ పిలిపించుకుని వేధిస్తున్నారని ప్రభాకరరావు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభాకర్‌ రావును అరెస్ట్‌ చేసే విషయంలో ఆగస్టు 5వ తేదీ వరకూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అయితే ఎలాగైనా ప్రభాకరరావును ఆరెస్ట్‌ చేయాలనే పట్టుదలతో ఉన్న సిట్‌ అదికారులు 5వ తేదీన సుప్రీంకోర్టులో జరగనున్న విచారణకు సిద్దం అవుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఒక సారి ఢిల్లీ వెళ్ళి వచ్చిన సిట్‌ అదికారులు అక్కడ లాయర్లతో కేసు విషయమై సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభాకరరావు విచారణకు అసలు సహకరించడం లేదని మరో పక్క సిట్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. జ్యుడీషియల్‌ విచారణతోనే ప్రభాకరరావు నుంచి వాస్తవాలు బయటకు రప్పించవచ్చని సిట్‌ అధికారులు బలంగా వాదిస్తున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story