Jagadish Reddy : కృష్ణలో జలకళ ఉన్న ఈ ప్రభుత్వం సాగునీరు అందించలేకపోతోంది
పంట పొలాలు నీరు అందివ్వకపోవడంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలు చేస్తున్నారు కానీ జిల్లాలో పంట పొలాలకు సాగునీరు అందించాలన్న తాపత్రయం ప్రభుత్వంలో కనిపించడం లేదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఏఎమ్‌ఆర్‌పీ కింద చివరి ఆయకట్టు వరకూ నీరు అందకపోయినా జిల్లా మంత్రులకు మాత్రం సోయి లేదని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి నీళ్ళు వదిలే విషయంలో ఉన్న ఆత్రుత జిల్లా రైతులకు నీళ్ళు ఇద్దమన్న విషయంలో ఏ కోసానా మంత్రుల్లో లేకపోవడం దురుదృష్టకరమని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. చెత్త మాటలు మాట్లాడటం తప్ప సాగునీళ్ళు ఇవ్వలేని దద్దమ్మలని మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేము ఉన్నప్పుడు నీటి లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి పూర్తి స్ధాయిలో సాగునీరు అందించామని, చెరువులను నిండుకుండల్లా ఉంచామని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఏఎంఆర్‌పీ లిఫ్ట్ కింద ఉన్న డీ25, డీ26, డీ29, డీ31, డీ40 డిస్ట్రీబ్యూటరీల కింద ఉన్న 70 వేల ఎకరాలకు నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని జగదీష్ రెడ్డి అన్నారు. వరుసగా ఎనిమిది సంవత్సరాలు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చామన్నారు.
కోమటిరెడ్డి మంత్రి అయిన తరువాత మళ్ళీ పొలాలు ఎండిపోతున్నాయని, ఆయనకు హెలీకాఫ్టర్ సోకు, ఆర్భాటాలు తప్ప రైతుల మీద ప్రేమ లేదని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఒక వైపు బనకచర్ల తో గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టాలాని చూస్తున్నారని నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై కోమటిరెడ్డి కేస్ లు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దందాలు చేసుడు, కమిషన్లు కాంట్రాక్టు లు తప్ప వీళ్లకు వేరే సోయి లేదని కనీసం ఉదయ సముద్రాన్ని ఈ ప్రభుత్వం నింపలేకపోయిందని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు ఇద్దరు అసమర్థులే అని నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలని అన్నారు కృష్ణ నదిలో జలకళ సంతరించుకున్నా కూడా జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయని గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారని తెలిపారు. వెంటనే పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ ను మంత్రి సొంత క్యాంపు ఆఫీస్ గా మార్చడం దురదృష్టకరమన్నారు. నల్గొండ ఐకాన్‌లా మేము గెస్ట్ హౌస్ కట్టామని దాన్ని గెస్ట్‌హౌస్‌లాగే వినియోగించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షుద్రపూజలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న కోమటిరెడ్డికి మంత్రి వర్గం లో కొనసాగే అర్హత లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
