Cantonment Mla : కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన దుండగులు
గన్‌మెన్ల నుంచి వెపన్లు లాక్కునే ప్రయత్నం చేసిన యువకులు

కాంగ్రెస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీగణేష్ పై 30 మంది యువకులు దాడికి ప్రయత్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది. ఉస్మానియా యూనివర్శిటీ వైపు కారులో వెళుతున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ వాహనాన్ని 20 ద్విచక్రవాహనాలపై వచ్చిన గుర్తు తెలియని యువకులు ఎమ్మెల్యే వాహానానికి తమ బండ్లను అడ్డుపెట్టి నిలువరించారు. ఓయూ పీఎస్ కు 200 మీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించిన దుండగులు ఆయన గన్ మెన్ల నుంచి వెపన్స్ గుంజుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కారులో నుంచి దిగక పోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఓయూ పీఎస్ పరిధిలోని వడ్డెర బస్తీలో బోనాల జాతరకు హాజరవుతుండగా గుర్తుతెలియని యువకులు ఈ దాడికి యత్నించారు. వెంటనే తనపై జరిగిన దాడియత్నాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్ ఏసీపీ జగన్లు ఓయూ పీఎస్ కు చేరుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ ని దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన దుండగుల కోంస గాలింపు చర్యలు ప్రారంభించారు.
