ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల, సి.ఎస్

రేపు మంగళవారం రైతు భరోసా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయం ఎదురుగాగల రాజీవ్ గాంధీ విగ్రహం ఆవరణలో ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలసి ఆయన సభా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతుభరోసా విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులు హాజరవుతారని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని రాజులుగా చూడాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని అందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తొలకరి ముందుగానే రైతుల వ్యవసాయ పనులకు రైతు భరోసాను వారి ఖాతాల్లో జమచేశామని అన్నారు. తొమ్మది రోజుల్లో రూ. 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతుల సంతోషాలు పంచుకోవడం కోసం రైతు నేస్తం వేదిక ద్వారా మంగళవారం సెక్రటేరియట్ ముందుగల రాజీవ్ విగ్రహం ప్రాంగణంలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు , దేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ. 70 వేల కోట్లు రుణమాఫీ జరిగితే తెలంగాణలో ఇప్పుడు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు చెల్లించటం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈసభకు అన్ని జిల్లాల నుంచి రైతు భరోసా పొందిన లబ్ధిదారులు పాల్గొననున్నారని చెప్పారు. ఎక్కడా లోపాలు లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
