పీఎల్‌జీఏకు భారీ దెబ్బ

Top Maoist Leader Deva Surrenders: మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) చీఫ్‌గా పనిచేస్తున్న బర్సే సుక్కా అలియాస్ దేవా, తెలంగాణ స్టేట్ కమిటీ కీలక సభ్యుడు కంకనాల రాజిరెడ్డి భార్య అడ్లూరి ఈశ్వరితో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలు, రూ.20 లక్షల నగదుతో కలిసి తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. గురువారం లొంగిపోయిన ఈ విషయాన్ని డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు.

దేవా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందినవాడు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత మద్వి హిడ్మాకు సన్నిహితుడిగా, ఒకే గ్రామానికి చెందినవాడిగా ప్రసిద్ధి. ఎన్‌ఐఏ నుంచి దేవాపై రూ.75 లక్షల రివార్డు ప్రకటించింది. లొంగిపోయినవారిలో ఆవుల సోమా, భేమే, సుశీల, వేముల రాజు, నందయ్యా, మంకు, అండా తదితరులు ఉన్నారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 2 ఎల్‌ఎంజీలు, యూఎస్‌ఏ తయారీ కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ తయారీ టవర్ ఆయుధం, 8 ఏకే-47 గన్స్, 8 ఎస్‌ఎల్‌ఆర్‌లు, నాలుగు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఉన్నాయి. హెలికాప్టర్‌లను కూల్చే సామర్థ్యం గల భారీ ఆయుధాలు కూడా సమర్పించారు.

పీఎల్‌జీఏ బెటాలియన్‌లో గతంలో 400 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం కేవలం 66 మంది మాత్రమే మిగిలారు. ఈ లొంగుబాటుతో పీఎల్‌జీఏ పూర్తిగా క్షీణించిందని డీజీపీ అన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కిష్టంపేట్‌కు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో రాష్ట్రానికి చెందిన స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారు.

సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు ఆత్మసమర్పణ చేశారని డీజీపీ తెలిపారు. లొంగిపోయినవారికి రూ.1.80 కోట్ల రివార్డు అందజేస్తామని, తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలిన 17 మంది తెలంగాణ మావోయిస్టులు కూడా లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి మరింత బలహీనతను తెచ్చిపెట్టినట్టు అధికారులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story