Tourism Conclave at Shilparamam: శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్: హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
ఒరిజినల్ సిటీగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

Tourism Conclave at Shilparamam: తెలంగాణ రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే మొదటి కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్‌సిటీ లాంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు మన హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటివాటిని మరింత ప్రోత్సహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ను ఓల్డ్ సిటీ అని పిలవకూడదు.. ఇది ఒరిజినల్ సిటీ. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా హైదరాబాద్‌లో ప్రపంచ సుందరీమణుల పోటీలను నిర్వహించి, ఈ నగరం ఎంత సురక్షితమైనదో ప్రపంచానికి చూపించాం. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, రక్షణ విషయాలపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా శాంతిభద్రతల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని ధ్రువీకరించింది. ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మా ప్రభుత్వం మీకు అండగా నిలబడటమే కాకుండా, లాభాలు అందించేలా చూస్తుంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ చర్యలు చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన ప్రదేశం. రెండు జీవనదుల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి ఇది. గలగలా ప్రవహించే నదులు, ఎత్తైన కొండలు, ప్రకృతి సౌందర్యంతో నిండిన అటవీ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులకు తెలంగాణ పరిసరాలు స్వర్గం లాంటివి. ఈ రాష్ట్రం పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) టూరిజం రంగంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రపంచ పటంపై చూపించకుండా, పర్యాటకులను ఆకర్షించకుండా నిర్లక్ష్యం చేసింది’’ అని భట్టి విక్రమార్క విమర్శించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
