Town Planning Officer Harika: ఏసీబీ చేతుల్లో చిక్కిన టౌన్ ప్లాన్ ఆఫీసర్ హారిక, నాలుగు లక్షల లంచం కేసు
నాలుగు లక్షల లంచం కేసు

Town Planning Officer Harika: నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, టౌన్ ప్లానింగ్ అధికారిణి హారిక రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. మంచిరేవులోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్‌కు LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) క్లియరెన్స్ కోసం హారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. మంగళవారం రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.
2025 జనవరి నుంచి గత ఎనిమిది నెలల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినవారిలో 20 మందికి పైగా మహిళా అధికారులు ఉండటం గమనార్హం. ఇటీవల, నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మత్స్య శాఖ అధికారిణి ఎం. చరిత రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సంగతి తెలిసిందే.
ఏసీబీ నివేదికల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల మున్సిపాలిటీలు అవినీతికి కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ అవినీతి జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయకుండా అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మధ్యవర్తులు లేదా ఏజెంట్ల ద్వారా సంప్రదించకపోతే ఫైళ్లు ముందుకు సాగడం లేదు. నిర్మాణ రకాన్ని బట్టి రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే అనుమతులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
