అమీర్‌ అలీఖాన్‌ స్ధానంలో మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ని ఎంపిక చేసిన అధిష్టానం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. శనివారం జరిగిన తెలంగాణ క్యాబినేట్ సమావేశంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఇద్దరి పేర్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే ఈ సారి ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాలో ఊహించని విధంగా మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ పేరును హైకమాండ్‌ తప్పించింది. ఆయన స్ధానంలో మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరును కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఖరారు చేసింది. హైకమాండ్‌ నిర్ణయం మేరకు శనివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో పాటు మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరును ఖరారు చేశారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను ఎంపిక చేయడం పట్ల బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. వారి పిటీషన్లను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 17తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్‌ అధిష్టానం అమీర్‌ అలీఖాన్‌ పేరును పక్కన పెట్టి మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరును జాబితాలో చేర్చడం కాంగ్రెస్‌ వర్గీయులను విస్మయానికి గురి చేసింది.

జూబ్లీహిల్స్‌ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మరణంతో త్వరలో ఆ స్ధానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి తానే అని అజారుద్దీన్‌ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న అజారుద్దీన్‌ జూబ్లీహిల్స్‌ స్ధానానికి పోటీ పడుతుండటంతో మిగిలిన ఆశావాహులు ఆశలు వదులుకున్నారు. దాదాపు అజారుద్దేనే జూబ్లీహిల్స్ అభ్యర్ధి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆయన్ను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేట్‌ చెయ్యడంతో జూబ్లీహిల్స్‌ అభ్యర్ధిత్వంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు ఊపిరి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిత్వం ఆశిస్తున్న వారిలో ప్రధానంగా దివంగత పి.జనార్ధన్‌రెడ్డి తనయ విజయారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. విజయారెడ్డి అభ్యర్ధిత్వంపై జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ నేతల్లో కూడా సానుకూల దృక్పథం ఉంది. పీజేఆర్‌ కుమార్తెగా ఆమె గెలుపు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. విజయారెడ్డి కాకపోతే ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంది. సీయం రేవంత్‌రెడ్డి అండదండలు దండిగా ఉన్న రోహిన్‌ రెడ్డి గెలుపు బాధ్యత కూడా సీయం రేవంత్‌రెడ్డి తీసుకునే అవకాశం ఉంది. దీంతో రోహిన్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్‌ అభ్యర్ధిగా ప్రచారం జరుగుతోంది.

Updated On 30 Aug 2025 4:29 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story