Union Minister Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్టి: కేసీఆర్, కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్!
కేసీఆర్, కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్!

Union Minister Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతలను సాక్షులుగా పిలవడం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. "ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటి? అసలు దోషులెవరో చెప్పాలి" అని ఆయన అన్నారు. సిట్ విచారణను మంత్రులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని, ఇప్పటికైనా సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారుల క్రెడిబిలిటీ పోతుందని హెచ్చరించారు.
కేటీఆర్‌లో అహంకారం ఇంకా తగ్గలేదని, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని పేర్కొన్న బండి సంజయ్... "కేసీఆర్, కేటీఆర్ నా ఛాలెంజ్‌కు సిద్ధమా?" అని సవాల్ విసిరారు. దేవుడి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతోపాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు ఉన్నాయని, ఆఖరికి కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. "ఇదంతా నిజం కాదా?" అని నిలదీశారు.
సింగరేణి సంస్థపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దోపిడీ చేస్తున్నాయని బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే... ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు, దళారులు దోచుకుంటున్నారని అన్నారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, సింగరేణి దోపిడీపై ఉమ్మడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు పోరాటాలు చేసి తెలంగాణ సాధించారని, కానీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఎక్కువ దోపిడీ జరుగుతోందని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో సింగరేణిని ఆయన కుటుంబమే దోచుకుందని, ఆ సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీని నడిపించారని ఆరోపించారు. రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును ప్రభుత్వం దోచుకుని సంస్థను అప్పుల పాల్జేసిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు లాభాల్లోకి తెస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక సొమ్ము దారి మళ్లించడం పరిపాటైందని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని, ఒకరి భాగోతం బయటపెడితే మరొకరి భాగోతం బయటపెడతామంటూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును చూసి అసహ్యిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

