US Insurance Giant Nationwide: హైదరాబాద్‌లో అమెరికా బీమా దిగ్గజం ‘నేషన్‌వైడ్’.. తెలంగాణలో పెరగనున్న ఉపాధి అవకాశాలు
ఉపాధి అవకాశాలు

US Insurance Giant Nationwide: అమెరికాకు చెందిన ప్రముఖ బీమా మరియు ఆర్థిక సేవల సంస్థ ‘నేషన్‌వైడ్’ హైదరాబాద్‌లో తన మొదటి అంతర్జాతీయ గ్లోబల్ సర్వీసెస్ సెంటర్‌ను ప్రారంభించింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదే. అమెరికాలోని కొలంబస్ (ఒహాయో), డి మోయిన్ (అయోవా), స్కాట్స్‌డేల్ (అరిజోనా) కేంద్రాల తర్వాత హైదరాబాద్‌ను నాలుగో ప్రధాన కార్యాచరణ కేంద్రంగా ఎంపిక చేసింది.
బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సంస్థ ఎండీ (ఇండియా) వికాస్ జైశ్వాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ సలహాదారు సాయికృష్ణ కూడా పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, క్యాపిటల్ మార్కెట్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచ టాప్-10 బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థల్లో తొమ్మిది సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నేషన్‌వైడ్ కూడా తెలంగాణను ఎంచుకోవడం మన ప్రతిభకు, సాంకేతిక సామర్థ్యాలకు మరో నిదర్శనం” అని అన్నారు.
వికాస్ జైశ్వాల్ మాట్లాడుతూ, “భారత్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు, హైదరాబాద్‌లో ఏర్పడిన బలమైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఎకోసిస్టమ్ కారణంగానే ఈ నగరాన్ని ఎంపిక చేశాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్, డిజిటల్, వ్యాపార సేవల సామర్థ్యాలను ఇక్కడి నుంచి అభివృద్ధి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల కార్యాచరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది” అని తెలిపారు.
కొత్త కేంద్రం ద్వారా భారతీయ నిపుణులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ఉద్యోగులకు అనుకూలమైన పని విధానాలు, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి కెరీర్ అవకాశాలపై సంస్థ దృష్టి సారించనుందని జైశ్వాల్ వివరించారు. నియామకాల వివరాలు త్వరలో సంస్థ కెరీర్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రారంభం తెలంగాణ ఐటీ రంగానికి మరో బూస్ట్ ఇచ్చే అవకాశం కల్పించింది.

