CM Revanth Reddy: రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ: సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణ
సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణ

CM Revanth Reddy: రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూడు రోజుల లండన్ పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు రానున్న ఆయన, హైదరాబాద్ చేరుకున్న తర్వాత అన్ని విషయాలపై మాట్లాడతానని తెలిపారు.
తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ సీఎం ఇలా అన్నారు: ‘‘అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై బలమైన మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి హృదయపూర్వక ధన్యవాదాలు. దేశ ప్రయోజనాల కోసం ఈ విషయంలో అండగా నిలిచిన పార్టీ, నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు. లండన్‌లో షెడ్యూలు ప్రకారం సమావేశాలు, కార్యక్రమాలను ముగించాను. కొన్ని గంటల్లో ముందస్తు షెడ్యూలు ప్రకారం బోస్టన్‌కు వెళ్లాల్సి ఉంది. కేంద్రం రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినందున హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతున్నాను.’’
కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ‘‘ఐవీలీగ్, ప్రపంచ అత్యున్నత సంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలనే యువత ఆకాంక్షలకు ఈ పర్యటన సమాధానంగా నిలిచేది. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి’’ అని సీఎం అన్నారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) యూఎస్‌ఏ, ఐఓసీ తెలంగాణ చాప్టర్‌లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలను రాజకీయ లేదా పరిపాలనా యంత్రాంగాలతో అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించాయి. గుజరాత్ సీఎంకు అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తెలంగాణ సీఎంకు ఎందుకు నిరాకరించారని ఐఓసీ-యూఎస్‌ఏ వైస్‌ఛైర్మన్ జార్జ్ అబ్రహం ప్రశ్నించారు.
అమెరికాలో రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు రాష్ట్రానికి చెందిన వేల మంది కొన్ని గంటల్లోనే పేర్లు నమోదు చేసుకున్నారని ఐఓసీ అమెరికా అధ్యక్షుడు మోహిందర్ సింగ్ గిల్జియాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ సమాల తెలిపారు. సీఎంకు అనుమతి నిరాకరించినా, ఆయన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ అధికారుల బృందం షెడ్యూలు ప్రకారం సమావేశాలు నిర్వహిస్తుందని, హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్ వంటి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని తెలంగాణ చాప్టర్ నాయకులు తెలిపారు.
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను నిరాకరించలేరని, రాష్ట్ర అభివృద్ధి వేగం కొనసాగుతూనే ఉంటుందని ఐఓసీ స్పష్టం చేసింది.

